Studio18 News - ANDHRA PRADESH / : ముందస్తు నోటీసులు ఇవ్వకుండా గత ప్రభుత్వం తనను టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడి బాధ్యతల నుంచి తప్పించిందని, తిరిగి ఆ బాధ్యతలు అప్పగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ రమణదీక్షితులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకు కోర్టు నోటీసులు జారీచేస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అసలేం జరిగిందంటే? టీటీడీలో వంశపారంపర్యంగా అర్చకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పదవీ విరమణ వర్తింపజేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రమణ దీక్షితులతో పాటు మరి కొందరు అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే, వయోభారంతో స్వామివారి కైంకర్య సేవలు సక్రమంగా నిర్వర్తించలేరన్న కారణంతో రమణ దీక్షితులను టీటీడీ విధుల్లోకి తీసుకోలేదు. అయితే, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రమణ దీక్షితులను ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడిగా నియమించింది. టీటీడీ నోటీసులు టీటీడీలో గౌరవ ప్రధాన అర్చకుడిగా తిరిగి నియమితులైన రమణ దీక్షితులు టీటీడీ పాలకమండలి, అధికారులు, సీనియర్, జూనియర్ పీఠాధిపతులపైనా, నాటి సీఎం జగన్ పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో టీటీడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది మార్చిలో రమణదీక్షితులను తొలగిస్తూ టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. టీటీడీ ఈవో సహజ న్యాయసూత్రాలకు విరుద్దంగా వ్యవహరించారని, ఈవో ఉత్తర్వులను రద్దు చేసి తిరిగి గౌరవ ప్రధాన అర్చకుడి బాధ్యతలు అప్పగించాలని కోరారు. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం ఏపీ ప్రభుత్వం, టీటీడీకి నోటీసులు జారీచేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 4 వారాలు వాయిదా వేసింది.
Admin
Studio18 News