Studio18 News - ANDHRA PRADESH / : మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అనుమానాస్పద రీతిలో అగ్నిప్రమాదం జరగడం పట్ల సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వెంటనే మదనపల్లె వెళ్లి, అగ్నిప్రమాదం ఘటనపై నిగ్గు తేల్చాలని డీజీపీ, సీఐడీ చీఫ్ లను చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఏపీ సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ హుటాహుటీన మదనపల్లె చేరుకున్నారు. ఇప్పటికే పోలీసు విచారణ ప్రారంభం కాగా... డీజీపీ, సీఐడీ చీఫ్ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించనున్నారు. ఈ ఘటనపై కుట్ర కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు... సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మదనపల్లెలో కొత్త సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందే ఈ ప్రమాదం జరగడంతో, కీలక ఫైళ్లను రూపుమాపేందుకు కావాలనే అగ్నిప్రమాదం సృష్టించారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Admin
Studio18 News