Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా మదనపల్లె నుంచి విజయవాడ వెళుతూ రాయచోటిలోని అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ను సందర్శించారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్, జాయింట్ కలెక్టర్, రెవెన్యూ అధికారులతో సిసోడియా సమావేశమయ్యారు. రెవెన్యూ శాఖ రికార్డులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ, మదనపల్లెలో ఫైళ్ల దగ్ధం ఘటనపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. మాధవరెడ్డి అనే వ్యక్తి ఇప్పటికే పరారీలో ఉన్నాడని, మదనపల్లె ఘటనలో నాలుగు బృందాలు విచారణలో పాలుపంచుకుంటున్నాయని వివరించారు. ఈ ఘటనలో ఏడుగురిని విచారిస్తున్నామని సిసోడియా వెల్లడించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక వస్తే అనేక వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. ఘటన జరిగిన కార్యాలయంలో పనిచేసే కొందరు సిబ్బందిపై అనుమానం ఉందని తెలిపారు. త్వరలో శాఖాపరమైన చర్యలు చేపడతామని, కొందరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలున్నాయని, మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశముందని స్పష్టం చేశారు. మంటల్లో కాలిపోయిన రికార్డుల రికవరీకి అవకాశముందని సిసోడియా పేర్కొన్నారు. కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల్లో లావాదేవీల రికార్డులు పరిశీలించామని చెప్పారు. 20 ఏళ్ల తర్వాత డి-పట్టాలు ఫ్రీహోల్డ్ లోకి వెళ్లిపోతాయన్న భావనతోనే ఈ ఘటనకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు కలుగుతున్నాయని వివరించారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 2.16 లక్షల ఎకరాల భూమి ఫ్రీహోల్డ్ అయిందని, అందులో 4,400 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని అన్నారు. ఫ్రీహోల్డ్ పై ఆయా జిల్లాల కలెక్టర్లు విచారణ చేపట్టారని సిసోడియా తెలిపారు.
Admin
Studio18 News