Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : MLA JC Ashmit Reddy : టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి క్షమాపణ చెప్పిన వ్యవహారంపై అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ ఉదంతంలో తన తప్పు లేదని, శాంత్రిభద్రతలను కాపాడాలన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యేకి సారీ చెప్పానని తెలిపారు. బుధవారం సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా భయపడబోనని చెప్పారు. ”తాడిపత్రి ఘటనలో నా వైపు నుంచి ఎలాంటి తప్పులేదు. లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలుగుతుందనే ఆ సమయంలో క్షమాపణ కోరాను. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డితో నేను దురుసుగా ప్రవర్తించలేదు. ఎస్సీ, ఎస్టీ కేసు నా పరిధిలోకి రాదని, అది డీఎస్పీ విచారణ చేస్తారని ఎమ్మెల్యేతో చెప్పాను. నేను తాడిపత్రిలో 14 నెలల నుంచి విధులు నిర్వహిస్తున్నా.. ఎలాంటి ఇబ్బందులు రాలేదు. నా మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా నాకు ఓకేన”ని సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. కాగా, ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిపై సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి కేసు నమోదు చేయలేదన్న ఆరోపణలతో పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి మంగళవారం ధర్నా చేశారు. ఆయన మద్దతుదారులు సీఐ ఇంటికి వెళ్లి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. చివరకు ఉన్నతాధికారుల జోక్యంతో వీడియో కాల్ చేసి ఎమ్మెల్యేకు సీఐ క్షమాపణ చెప్పడంతో వివాదం ముగిసింది. అయితే ఇందులో తన తప్పేమి లేదని సీఐ లక్ష్మీకాంత్ తాజాగా వివరణ ఇచ్చారు. ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి కాగా, ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి బుధవారం అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌ను కోరారు. ఎస్పీని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”ఇసుక అక్రమ రవాణాను అరిటకట్టాలని ఎస్పీని కోరాం. కొంతమంది పోలీసుల తీరులో ఇంకా మార్పు రాలేదు. ఒకరిద్దరి పోలీసుల వల్ల మొత్తం జిల్లా పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోంది. తాడిపత్రి ఇసుక మాఫియా గురించి ఎన్జీటీకి కూడా ఫిర్యాదు చేశాం. ఇసుక అక్రమ రవాణా గురించి ఒక ప్రత్యేక టీం నీ ఏర్పాటు చేయమని అడిగాం. ఇసుక అక్రమ రవాణా గురించి నెల రోజుల నుంచి లెటర్లు రాస్తున్నాం. ఎవరు స్పందించక పోవడం వల్ల స్వయంగా నేనే రంగంలోకి దిగాను. తాడిపత్రి నియోజక వర్గంలో ఇసుక దందా జరగనీయం. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ని కోరాం. నన్ను దాదాపు 5 గంటల సేపు వర్షంలో నిలబెట్టారు. ఇంకా కొంతమంది పోలీసులు వైసీపీ జెండాను కప్పుకొని డ్యూటీ చేస్తున్నార”ని అస్మిత్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌ను కూడా కలిసి తాడిపత్రిలో జరిగిన పరిణామాలను వివరించారు.
Admin
Studio18 News