Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ నందిగామ మాజీ ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురయింది. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావుపై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో జరిగింది. భారీ వర్షాలు, వరదల కారణంగా పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ముంపునకు గురయిన ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించి భోజనం తదితర సదుపాయాలను కల్పిస్తున్నారు. ఇదే క్రమంలో కంచికచర్ల మండలంలోని వరద బాధితులకు స్థానిక ఓసీ క్లబ్ లో బస ఏర్పాటు చేశారు. కాగా, నందిగామ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత డాక్టర్ మొండితోక జగన్మోహనరావు వరద బాధితులను పరామర్శించేందుకు ఓసి క్లబ్‌కు వెళ్లారు. బాధితులకు సరిగా సాయం అందించడం లేదంటూ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఓ బాధితుడు తమకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ వివరించబోగా, ఆ వ్యక్తిని మాజీ ఎమ్మెల్యే పరుష పదజాలంతో దూషించారు. నాలుగు రోజులుగా కటమి నేతలు అన్ని విధాలుగా సహాయం అందిస్తుంటే .. ఇప్పుడు వచ్చి బుదర రాజకీయాలు చేస్తారా అంటూ బాధితులు ఆయనపై మండిపడ్డారు. మొండితోక గో బ్యాక్ అంటూ వారు నినాదాలు చేయడంతో మాజీ ఎమ్మెల్యేని అక్కడి నుండి పంపించేశారు.
Admin
Studio18 News