Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని, రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశాలోని పూరీ, పశ్చిమ బెంగాల్ లోని దిఘా మధ్య ఇది తీరం దాటొచ్చని ఐఎండీ అంచనా వేసింది. కాగా, వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని... నేడు అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వివరించింది. విశాఖ, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇప్పుడు భారీ వర్ష సూచనతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
Admin
Studio18 News