Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. గంట గంటకూ నీటి మట్టం పెరుగుతూ జలాశయం నిండుకుండగా మారింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి నాలుగు లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నది. దీంతో డ్యామ్ గేట్లు ఎత్తి 5 లక్షల క్యూసెక్కులకుపైగా విడుదల చేయడంతో నాగార్జునసాగర్‌కు కృష్ణమ్మ పరుగులు తీసున్నది. నాగార్జున సాగర్ కూడా నిండుకుండలా మారిపోతున్నది. దీంతో సాగర్ నుంచి కూడా నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలు ఇలా.. ఈ ఉదయం 7 గంటలకు శ్రీశైలం జలాశయానికి 4,06,236 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఔట్ ఫ్లో 5,50,731 క్యూసెక్కులగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.2 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 అడుగులు కాగా, ప్రస్తుతం 200.2 అడుగులు (92.77శాతం) గా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. నాగార్జున సాగర్ విషయానికి వస్తే ఉదయం 9 గంటల సమయానికి నీటి మట్టం 572.7 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 263.35 (84.39) టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 3,14,409 క్యుసెక్కులుగా నమోదైంది. 35,409 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 19 అడుగుల మేర నీటి మట్టం చేరుకుంటే గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తారు. ఇన్ ఫ్లో ఇదే విధంగా కొనసాగితే రేపు సాయంత్రానికి సాగర్ గేట్లను ఎత్తే అవకాశం ఉంది. ఇందు కోసం ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ముందుగా కొంత మేర క్రస్ట్ గేట్లు పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.
Admin
Studio18 News