Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, అమరావతిపై ఉన్న నీలి నీడలు తొలగిపోయాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడంతో, అమరావతి భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోయింది. గడచిన ఐదేళ్లలో అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కానీ, తాజా ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అమరావతి రాజధానిగా కొనసాగిస్తామని స్పష్టం చేయడం, కేంద్ర ప్రభుత్వం రూ. 15,000 కోట్లను కేటాయించడంతో పనులు మళ్ళీ ప్రారంభమయ్యాయి. జంగిల్ క్లీయరెన్స్ తో రాజధాని ప్రాంతంలో నిర్మాణం వేగం పుంజుకుంది. రాజధాని నిర్మాణం కోసం ప్రజలు, వివిధ పార్టీ శ్రేణులు, ప్రముఖులు, సంస్థలు విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తన మొదటి నెల వేతనం రూ.3,01,116లను విరాళంగా ఇచ్చారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలసిన మంత్రి ఈ చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా రామ్ ప్రసాద్ రెడ్డిని అభినందించారు. తన విరాళం గురించి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో, ఆయనకు అభిమానులు, టీడీపీ శ్రేణులు అభినందనలు తెలుపుతున్నారు.
Admin
Studio18 News