Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : గతంలో కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద జరిగే జల హారతులను పున: ప్రారంభించనున్నట్లు ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ దుర్గమ్మ తల్లి అంతరాలయంలో వీడియోగ్రఫీ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రూ.113 కోట్ల సి.జి.ఎఫ్.నిధులతో 160 దేవాలయాల ఆధునికీకరణ పనులను చేపడుతున్నామన్నారు. ధూప దీప నైవేద్యాలకై ప్రస్తుతం ఇచ్చే రూ.5 వేలను రూ.10 వేలకు పెంపుచేస్తున్నామన్నారు. రెవిన్యూ సదస్సుల్లో దేవాదాయ భూములపై కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారని, రాష్ట్ర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవాదాయ భూముల పరిరక్షణకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబరులోకి వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య కుటుంబ సభ్యులతో కలిసి ప్రవేశించిన మంత్రి పలు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సుపరిపాలన దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. గత ప్రభుత్వ పాలనలో తిరుమల నుండి ఉత్తరాంధ్రలోని అరసవిల్లి వరకూ దేవుడి ఆస్తులను కూడా వదలని పరిస్థితులు అనేకం మీడియా ముఖంగా వెలువడిన పరిస్థితి అందరికీ తెలుసన్నారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని చర్యలు చేపట్టాల్సిన గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎటువంటి ఆరోపణవచ్చినా సరే వెంటనే నివేదికలు తెప్పించుకుని బాధ్యులయిన వారిపై చర్యలు తీసుకుంటూ పాలనను ముందుకు తీసుకుపోవడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో రెండు ఆలయాలకు సంబంధించి విచారణ జరిపించి, వచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా తప్పు జరిగినట్లు నిర్థారించుకుని, అందుకు బాధ్యులైన ఐదుగురు అధికారుల నుండి వివరణ తీసుకుని సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. దేవాదాయ శాఖలో తప్పుచేసిన చిన్న అధికారులనే కాదు పెద్ద అధికారులను కూడా ఏ మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు.
Admin
Studio18 News