Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Pilli Subhash Chandra Bose : తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఖండించారు. మరో ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డితో కలిసి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ మారడం లేదని ఎన్నిసార్లు చెప్పినా తనపై కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని వాపోయారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు తప్ప తమ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులు ఇంకెవరూ రాజీనామా చెయ్యడం లేదని తెలిపారు. ”నేను పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.. వాస్తవం కాదు. మా రాజ్యసభ సభ్యులు ఇంకెవరూ రాజీనామా చెయ్యడం లేదు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం ముందు నుంచి నేను జగన్ వెంట ఉన్నాను. మంత్రి పదవి వుండగానే రాజీనామా చేసి జగన్ వెంట నడిచాను. నాపై ఎందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. పార్టీ మారడం లేదని చాలా సార్లు చెప్పాను, అయినా ఇలా చేస్తున్నారు.. బాధేస్తుంది. 2019లో ఓటమి పాలయినా జగన్ నాకు మంత్రి పదవి ఇచ్చారు. ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగే మనిషిని నేను కాదు. ఆర్థికంగా నేను సంపన్నున్ని కాదు. విధేయతతో మాత్రం సంపన్నుడిని. నాపై ఏమైనా అనుమానం ఉంటే మీడియా నన్ను అడగండి.. మీ ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయిద్దు. నిన్న రాజీనామా చేసిన వాళ్ళకి పార్టీ చాలా అవకాశాలు ఇచ్చింది. రాజకీయాల్లో నైతికత ఉండాలి.. పార్టీకి ఉన్న పదవిని కోల్పోయేలా చెయ్యడం పార్టీకి వెన్నుపోటు పొడవడమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవికి రాజీనామా అంటే పార్టీని హత్య చెయ్యడమే. రాజీనామా చేసి వెళ్తున్నామని చెప్పడానికి వీలు లేదు. పార్టీకి ఉన్న సభ్యత్వం కోల్పోయేలా చెయ్యడం నైతికత కాదు. రాజకీయాల్లో ఓటమి శాశ్వతం కాదు.. ఓడిపోతే పార్టీ నుంచి వెళ్లిపోవడం రాజకీయ లక్షణం కాదు.. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ తోనే ఉంటాన”ని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. కాగా, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు నిన్న రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరూ వైసీపీని వదిలిపెట్టి టీడీపీలో చేరనున్నారు.
Admin
Studio18 News