Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : భారీ వర్షాలు, వరదలతో కొట్టుకుపోయిన వాహనాలు, నీట మునగడంతో రిపేరుకు వచ్చిన వాహనాల విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు మరమ్మతుల భారం తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు పలు ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో తాజాగా సమావేశమయ్యారు. ఇప్పటికే సర్వం కోల్పోయిన వరద బాధితులకు వాహనాల మరమ్మతులు పెనుభారంగా మారకుండా చూడాలని కోరారు. మరమ్మతుల ఖర్చులు తగ్గించేలా చూడాలన్నారు. నీట మునిగిన వాహనాలు, కొట్టుకుపోయిన వాహనాలకు సంబంధించిన క్లెయింలను వేగంగా పరిష్కరించి బాధితులను ఆదుకోవాలన్నారు. బ్యాంకుల ప్రతినిధులతోనూ భేటీ అయిన సీఎం.. వాహనాల లోన్లను రీషెడ్యూల్ చేయాలని కోరారు. ప్రభుత్వంతో కలిసి బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రూల్స్ కు కొన్ని సడలింపులు చేసి ప్రజలకు కొత్త రుణాలను మంజూరు చేయాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో క్లెయింల దరఖాస్తుకు అవకాశం కల్పించాలని బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు.
Admin
Studio18 News