Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : సాధారణంగా సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడతాయి. అయితే, నేడు భూ ఉపరితలంపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్టణం వాతావరణశాఖ తెలిపింది. ఐదు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ఫలితంగా మధ్య, ఉత్తర, వాయవ్య భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. తాజాగా ఇప్పుడు తూర్పు, మధ్య భారతదేశంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. నిన్న ఉదయం పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం సాయంత్రానికి ఝార్ఖండ్, ఉత్తర ఒడిశా, చత్తీస్‌గఢ్ పరిసరాల్లో కేంద్రీకృతమైంది. ఈ ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ఓ మోస్తరుగా కదులుతున్నందున నిన్న అనేక చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడ్డాయి. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
Admin
Studio18 News