Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నట్టుండి భూమి కుంగిపోవడం మిస్టరీగా మారింది. జిల్లా పరిధిలోని దువ్వూరు మండలం చింతకుంట గ్రామంలో రైతు మానుకొండు శివకి చెందిన వ్యవసాయ భూమిలో బుధవారం నాడు సుమారు 6 అడుగుల లోతు కుంగిపోయింది. పైనుంచి చూస్తుంటే అచ్చం పెద్ద బావిలా కనిపిస్తోందని రైతు వాపోతున్నారు. అసలేమైందో కూడా తెలియడం లేదని, ఉన్నట్టుండి వ్యవసాయ భూమి ఇలా భారీ గుంతలుగా మారడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. 2019లోనూ ఇలాగే జరిగిందని శివ చెప్పారు. ఇదే భూమి అప్పట్లో కూడా ఇలాగే కుంగిందని తెలిపారు. దాంతో దాన్ని పూడ్చేందుకు రూ.50 వేలు ఖర్చు చేయాల్సి వచ్చిందని వాపోయారు. అసలు ఇలా భూమి ఉన్నట్టుండి ఎందుకు కుంగిపోతుందో వ్యవసాయ అధికారులు ఒకసారి వచ్చి పరిశీలిస్తే బాగుంటుందని రైతు కోరుతున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి పంట వేయలేదు. దాంతో భూమిలో పంటసాగు లేకపోవడం, పొలంలో ఎవరూ లేని సమయంలో భూమి కుంగడంతో పెద్ద ప్రమాదం తప్పిందని రైతు శివ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా అధికారులు తన గోడును వినిపించుకోవాలని కోరారు. ఇక రైతు శివ పొలంలో ఒక్కసారిగా ఇలా భూమి కుంగిపోయి భారీ గుంత ఏర్పడడంతో దాన్ని చూడ్డానికి చుట్టుపక్కల ప్రజలు భారీగా తరలి వస్తున్నారు.
Admin
Studio18 News