Studio18 News - ANDHRA PRADESH / : గత ఎన్నికల్లో జగన్ ఓడిపోలేదని... ప్రజలు ఓడిపోయారని ఏపీ మాజీ మంత్రి రోజా అన్నారు. అంతా ఒక సునామీలా జరిగిపోయిందని... ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదని... ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదని తెలిపారు. ఇంత ఘోరంగా ఓడిపోయే తప్పులు వైసీపీ నాయకత్వం, ఎమ్మెల్యేలు, పార్టీ చేయలేదనే విషయాన్ని తాను ఘంటాపథంగా చెప్పగలనని అన్నారు. ఏం జరిగిందనేది ఈరోజు కాకపోయినా.. ఏదో ఒకరోజు బయటకు వస్తుందని... ఆరోజు ప్రజలు అన్నీ తెలుసుకుంటారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నామని... ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అందుబాటులో ఉంటామని ప్రజలకు మాటిచ్చామని... మాట ప్రకారం అందరం ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. కోవిడ్ టైమ్ లో కూడా నగరి నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతో పాటుపడ్డానని తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నామని చెప్పారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే కుటుంబ పెద్ద అని... ఒక కుటుంబ పెద్దగా కుల, మత, పార్టీలకు అతీతంగా అందరి మనిషిలా తాను పని చేశానని తెలిపారు. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని అంకాలమ్మ గుడి వద్ద నూతనంగా నిర్మించిన బలిజ భవనాన్ని రోజా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
Admin
Studio18 News