Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Food Poisoning Anakapalle District : అనకాపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బాలల సంక్షేమ సంస్థలు, హాస్టళ్లను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లాలోని పాకరావుపేట మండలం అరట్లకోటకు చెందిన పాస్టర్ ముక్కుడుపల్లి కిరణ్ కుమార్ కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో చిన్న రేకుల షెడ్ లో ఓ ప్రార్ధనా మందిరం నడుపుతున్నారు. పరిశుద్దాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ (పాస) పేరుతో ఓ అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్ లో 90మందికిపైగా విద్యార్థులు ఉంటూ సమీప పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నారు. కొంతమంది సమోసాలు, ఇతర ఆహార పదార్థాలు అందజేయగా.. వీటిని తిన్న తరువాత విద్యార్థులు వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. ఈ ఘటనలో 82మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. వారిలో ముగ్గురు మృతిచెందారు. అస్వస్థకు గురైన కొందరిని చికిత్స నిమిత్తం కేజీహెచ్ లో చేర్పించారు. మిగిలినవారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, మంగళవారం వివిధ ఆసుపత్రుల నుంచి 41 మందిని కేజీహెచ్ కు తరలించారు. నర్సీపట్నం, పాడేరు, చింతపల్లి ఆసుపత్రుల్లో మరికొంత మంది చికిత్స పొందుతున్నారు. కేజీహెచ్ ఆస్పత్రికి తరలించిన 41 మందిలో ముగ్గురిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేజీహెచ్ లో 38 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శిరీష పరామర్శించారు. కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. బాధిత కుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. మరోవైపు ట్రస్ట్ హాస్టల్ నిర్వాహకుడి కిరణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Admin
Studio18 News