Studio18 News - ANDHRA PRADESH / : Janasena on Union Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక కేటాయింపుల పట్ల జనసేన పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఆ పార్టీ ఎంపీ వల్లభనేని బాలశౌరి మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్లు రూపాయలు కేటాయించిన కేంద్రం, అవసరమైతే పెంచుతామని చెప్పడం సంతోషకరమన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పూర్తి ఖర్చు కేంద్రం భరిస్తుందని చెప్పారు. విభజన చట్టంలో పొందు పరిచిన హామీలను నెరవేరుస్తామని కేంద్రం స్పష్టం చేసిందని తెలిపారు. వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్‌తో పెట్టుబడులతో పాటు ఉపాధి అవకాశాలు వస్తాయని ఎంపీ బాలశౌరి ఆశాభావం వ్యక్తం చేశారు. ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్‌తోనూ పెట్టుబడులు పెరుగుతాయన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సాధించిన విజయంగా ఆయన వర్ణించారు. ఎన్డీఏ ఆర్కిటెక్ట్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు కేంద్ర పెద్దలను కలవడం వల్ల ఏపీకి కేంద్ర బడ్జెట్ నుంచి అధిక నిధులు వచ్చాయని చెప్పారు. ఏపీకి శుభదినం: మంత్రి అనగాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 15 వేల కోట్ల రూపాయలు కేటాయించడం ప్రజలందరూ ఆనందపడే అంశమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు శుభదినం. రాష్ట్ర పుననిర్మాణానికి కట్టుబడి ఉన్నామని మోదీ ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం. ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అమరావతికి ఢోకా లేదు: సోమిరెడ్డి అమరావతి అభివృద్ధికి ఎటువంటి ఢోకా లేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై ఆయన మాట్లాడుతూ.. చెన్నై, విశాఖ పారిశ్రామిక కారిడార్ మంజూరు కావడం అభివృద్ధికి సంకేతం. పోలవరం డ్యాం కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. జగన్ డ్యామేజ్ చేయడం కోసం ఢిల్లీ వెళ్లారు. జగన్ ఆటలు సాగలేదు. అమరావతికి చంద్రబాబు పూర్వవైభవం తీసుకురానున్నారు. అమరావతి 15000 వేల కోట్లరూపాయలు కేంద్రం చెలించడం సంతోషం. పోలవరం ప్రాధాన్యత ఇస్తూ నిధులు ఇస్తామనడం శుభపరిణామం. వెనుకబడిన జిల్లాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామనడం మంచి పరిణామం. ప్రధాని మోదీ, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌కి ధన్యవాదాలని అన్నారు.
Admin
Studio18 News