Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండా ఎగురవేశారు. జెండా వందనం అనంతరం పోలీస్ పెరేడ్‌లో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు. జీవనాడి పోలవరానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. పేదల సేవలో కార్యక్రమం ద్వారా పింఛన్లు పెంచి ఇంటి వద్దే ఇస్తున్నామని చెప్పారు. ఆగస్టు 1న తొలిరోజే 97 శాతానికి పైగా పింఛన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించామని తెలిపారు. గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అన్న క్యాంటీన్లను తొలగించిందని చంద్రబాబు నాయుడు చెప్పారు. తాము నేటినుంచి 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని అన్నారు. యువతకు అవకాశాలు సృష్టిస్తే అద్భుతాలు సాధిస్తారని చంద్రబాబు నాయుడు చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజల ఆస్తులు, ప్రభుత్వ భూములను దోచుకున్నారని తెలిపారు. నాటి అక్రమాలపై లోతైన దర్యాప్తు జరిపిస్తామని, అక్రమార్కులను శిక్షించి తీరతామని అన్నారు.
Admin
Studio18 News