Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ‘ముంబై నటికి వేధింపులు.. అందుకు సజ్జల రామకృష్ణారెడ్డి సాయం’ అంటూ వస్తున్న కథనాలను వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆ కథనంలో నేరుగా తనపై ఆరోపణలు చేస్తూ వచ్చిన కథనాల్లో నిజం లేదన్నారు. ‘మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న హత్యలు, దౌర్జన్యాలు, దాడులు, ఆస్తుల విధ్వంసంతో అరాచక పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం కూటమి ప్రభుత్వం కొత్త పన్నాగం మొదలు పెట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీయడం, ఆ పార్టీ నాయకుల వ్యక్తిత్వ హననం లక్ష్యంగా అవాస్తవ కథనాలు రాస్తున్నారు. ఆ తర్వాత వాటిని పట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు’ అని సజ్జల చెప్పారు. టీడీపీ, ఆపార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, మరికొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. ఆ కథనం పూర్తిగా అవాస్తవం.. అసంబద్ధం. అన్యాయంగా, అడ్డగోలుగా రాశారని అన్నారు. తన ప్రతిష్ఠను దెబ్బ తీసేలా ఇలాంటి కథనం రాసినందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని తెలిపారు.
Admin
Studio18 News