Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : కోరిన కోర్కెలు తీర్చే తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. నవంబర్ నెల ఆర్జిత సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ ఈ రోజు (ఆగస్టు 19) నుంచే మొదలుకానుంది. ఈ మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్‌సైట్‌పై (ttdevasthanams.ap.gov.in) భక్తులు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు టికెట్ల లక్కీడిప్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందినవారు 23వ తేదీ 12 గంటల లోపు చెల్లింపులు చేయాల్సి ఉంటుందని ప్రకటనలో టీటీడీ పేర్కొంది. ఇక శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను 22న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు పేర్కొంది. 24న ప్రత్యేక దర్శనం టికెట్లు.. 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని, ఉదయం 10 గంటల నుంచి బుకింగ్ ప్రారంభమవుతుందని టీటీడీ తెలిపింది. అదే రోజు వసతి గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్టు పేర్కొంది. తిరుమల, తిరుపతి శ్రీవారి స్వచ్ఛంద సేవా జనరల్ కోటాను 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ కోటాను మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు పేర్కొంది. అయితే అంతకంటే ముందు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, వసతి గదుల కోటాను విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఇక అదే రోజున ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోటా టికెట్లు విడుదల అవుతాయని తెలిపింది.
Admin
Studio18 News