Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన ఓ మహిళ అక్కడ యజమానుల పోరు భరించలేక స్వదేశానికి తిరిగొచ్చింది. సొంత ఊరికి వెళ్లేందుకు బస్సు ఎక్కింది. కానీ, ఇంటికి చేరకుండానే బస్సులోనే ప్రాణాలొదిలింది. ఏపీకి చెందిన ఓ మహిళ హైదరాబాద్ నుంచి తణుకు వెళుతుండగా బస్సులోనే గుండెపోటుతో మృతిచెందిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలికి చెందిన ప్రభాకర్‌కు తూర్పుగోదావరి జిల్లా కోరుమామిడికి చెందిన బొంతా సత్య పద్మతో 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే, ఈ కుటుంబానికి ఆర్థిక సమస్యలు వెంటాడాయి. దాంతో సత్య పద్మ భర్తకు ఆర్థికంగా సాయం చేసేందుకు ఏదైనా పనిచేయాలని అనుకుంది. ఈ క్రమంలోనే విజయవాడకు చెందిన ఓ మహిళా ఏజెంట్ ద్వారా మస్కట్ వెళ్లాలని నిర్ణయించుకుంది. దాని కోసం తన వద్ద ఉన్న డబ్బుతో పాటు మరికొంత అప్పు చేసి మొత్తం రూ. 2 లక్షలు ఏజెంట్‌కు ఇచ్చింది. దాంతో ఆమెను ఏజెంట్ గల్ఫ్ దేశం మస్కట్ పంపించింది. కానీ అక్కడికి వెళ్లిన సత్య పద్మకు అనుకున్న పని దొరకలేదు. దొరికిన పని చేసుకుందామనుకుంటే యజమానుల పోరు ఎక్కువైంది. విశ్రాంతి లేకుండా ఎక్కువ పని చెప్పడంతో ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో చేసేదేమిలేక స్వదేశానికి వచ్చేయాలని నిర్ణయించుకుంది. ఇదే మాట అక్కడి యజమానులతో పాటు ఇక్కడి ఏజెంట్‌కు చెప్పింది. దాంతో రెండు లక్షలు ఇస్తేనే స్వదేశానికి వచ్చే ఏర్పాట్లు చేస్తామని ఏజెంట్ చెప్పింది. ఇక్కడ ఉన్న భర్త ప్రభాకర్ ఏజెంట్‌కు ఆ రెండు లక్షలు చెల్లించాడు. అలా డబ్బులు చెల్లించిన తర్వాత సత్యపద్మ ఈ నెల 24న మస్కట్ నుంచి స్వదేశానికి బయల్దేరింది. మస్కట్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆమె.. తణుకు బస్సు ఎక్కింది. కానీ అప్పటికే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో బస్సులో గుండెపోటుకు గురైంది. దాంతో కూర్చున్న సీటులోనే మృతిచెందింది. ఇది గమనించిన బస్సు డ్రైవర్, కండక్టర్.. సత్య పద్మ భర్తకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఏజెంట్‌కు డబ్బులు చెల్లించిన తర్వాత తన భార్య ఎప్పుడు వస్తుందనే విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ప్రభాకర్ భోరున విలపించాడు. ఈ నెల 30న పంపిస్తామని చెప్పి 24వ తేదీనే పంపించేశారని తెలిపాడు. ఆమె అనారోగ్యం గురించి తెలిసి కూడా ఇలా చేయ్యడం దారుణమని ప్రభాకర్ కన్నీరుమున్నీరు అయ్యాడు.
Admin
Studio18 News