Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇద్దరూ హైదరాబాద్ లోనే ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఉన్నారు. రెండు రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్న చంద్రబాబు పలు కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే అంశంపై ఆయన పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఈ అంశం గురించే ఆయన వీలు చిక్కినప్పుడల్లా హైదరాబాద్ కు వస్తున్నారు. ఇక్కడకు వచ్చినప్పుడల్లా తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమవుతున్నారు. నిన్న కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు దాదాపు రెండు గంటల సేపు సమావేశమయ్యారు. తెలంగాణలో టీడీపీ బలోపేతం, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ నుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని ఆయన సూచించారు. కొత్తవారిని చేర్చుకోవడంపై కూడా దృష్టి సారించాలని చెప్పారు. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి ఇక్కడకు వచ్చి సమీక్ష నిర్వహిస్తానని నేతలకు చంద్రబాబు తెలిపారు. ఏపీలో టీడీపీ గెలిచిన తర్వాత... తెలంగాణలో కూడా ఆ పార్టీకి ఊపు వచ్చింది. ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన అమరావతికి బయల్దేరనున్నారు. మరోవైపు పవన్ కూడా హైదరాబాద్ లోని తన నివాసంలో ఉన్నారు. జనసేన నేతలతో ఆయన సమావేశమవుతున్నారు. వాస్తవానికి ఈరోజు ఆయన అమరావతికి వెళ్లాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన తన షెడ్యూల్ ను మార్చుకున్నారు. రేపు ఉదయం 8.30 గంటలకు పవన్ బేగంపేట్ విమానాశ్రయం నుంచి అమరావతికి బయల్దేరనున్నారు.
Admin
Studio18 News