Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Road Accident in East Godavari : తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరిపాటిదిబ్బలు – చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో మినీలారి అదుపు తప్పి పంటబోదెల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాద సమయంలో మినీలారీలో 10మంది ఉన్నారు. వీరిలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఇందులో డ్రైవర్ ఘటన స్థలం నుంచి పరారయ్యాడు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మినీలారీ ఏలూరు జిల్లా టి. నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మినీలారీ బోల్తాపడిన సమయంలో అందులోని జీడిపిక్కల బస్తాలు మీదపడటంతో ఊపిరాడక వారు చనిపోయారు. మృతిచెందిన వారిలో సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన దేవాబత్తుల బూరయ్య (40), తమ్మిరెడ్డి సత్యనారాయణ(45), పి. చినముసలయ్య (35), కత్తవ కృష్ణ (40), కత్తవ సత్తిపండు (40), తాడి కృష్ణ (45), నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్ లు ఉన్నారు. మృతులంతా కూలీలు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ ఆచూకీకోసం వెతుకులాట ప్రారంభించారు. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమా? మరేదైనా కారణం ఉందా అనేకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Studio18 News