Studio18 News - ANDHRA PRADESH / : కుండపోత వర్షాలతో ఏపీలో జలవిలయం కనిపిస్తోంది. విజయవాడ నగరం మొత్తం జలమయమయింది. భారీ వరదతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రౌండ్ లో ఉంటూ పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. అర్ధరాత్రి కూడా ఆయన వరద ముంపు ప్రాంతాల్లో బోటులో పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. నిత్యావసరాలను దగ్గరుండి అందించారు. ఈ ఉదయం విజయవాడ కలెక్టరేట్ లో ఉన్నతాధికారులతో చంద్రబాబు అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఒక్కరాత్రి ధైర్యంగా ఉండాలని, తాము అన్ని విధాలుగా మీకు తోడుగా ఉన్నామని ప్రజలకు హామీ ఇచ్చామని చెప్పారు. ఆ హామీని నిలబెట్టుకునే దిశగా అధికార యంత్రాంగం పని చేయాలని అన్నారు. ఎంత మందిని రక్షించామనేదే మన ముందున్న లక్ష్యమని చెప్పారు. బోట్లు సైతం కొట్టుకుపోయేంత సమస్యలు మన ముందున్నాయని చంద్రబాబు అన్నారు. బోట్ల నుంచి వచ్చిన వారిని వెంటనే తరలించేందుకు బస్సులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వృద్ధులు, రోగులు ఇబ్బంది పడకుండా అవసరమైతే వారిని హోటళ్లలో ఉంచాలని సూచించారు. వరద బాధితుల కోసం కల్యాణమంటపాలు, ఇతర కేంద్రాలను సిద్ధం చేయాలని చెప్పారు. మొత్తం 47 సురక్షిత కేంద్రాలను గుర్తించామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు.
Admin
Studio18 News