Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Budameru : నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతుంది. గత 30ఏళ్లలో బుడమేరు ఎన్నడూ ఇంత ఉదృతంగా ప్రవహించలేదని ముంపు ప్రాంతాల ప్రజలు పేర్కొంటున్నారు. బుడమేరు వరద ఉధృతి కారణంగా పుట్టగుంటలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వరద నీరు చోచ్చుకు వచ్చింది. అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అరిపిరాలలో అత్యంత ప్రమాదకర స్థితిలో బుడమేరు ప్రవాహం కొనసాగుతుంది. కట్టకు అడుగు దూరంలో వరదనీరు ప్రవహిస్తుంది. అంతకంతకూ పెరుగుతున్న వరద నీటితో బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అధికారులు అప్రమత్తమై బోట్ల ద్వారా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాలినడకన బురదలోనే మంత్రులు.. మూడు వేల మందిని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్ రావు సహాయక చర్యలను పర్యవేక్షించారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశాలతో.. బోట్ల ద్వారా ముంపు బాధిత ప్రజలకు టిడిపి నేతలు ఆహారాన్ని అందిస్తున్నారు. బుడమేరు నీటి ఉధృతిపై అధికారులతో కలెక్టర్ బాలాజీ సమీక్షించారు. బస్సులు, పడవలు ద్వారా ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలని కలెక్టర్ బాలాజీ కోరారు. మరోవైపు.. బుడమేరు గండి పూడ్చే పనులను మంత్రులు నారా లోకేశ్, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. సరియైన రహదారి లేకపోవడంతో బురదలోనే కాలినడకన గండిపడిన ప్రాంతానికి మంత్రులు వెళ్లారు. బుడమేరుకు విజయవాడ నగరం వైపు మూడు గండ్లు, మరోవైపు నాలుగు గండ్లు పడ్డాయి. ఒక్కో గండి దాదాపు 50మీటర్ల పైనే ఉండటం, వరద ఉదృతంగా ఉండటంతో గండ్లు పూడ్చే పనులు ప్రభుత్వానికి పెను సవాల్ గా మారింది. ఎట్టకేలకు బుడమేరుకు పడిన మొదటి గండిని అధికారులు పూడ్పించారు. మిగిలిన గండ్లూ యుద్ధప్రాతిపదికన పూడ్చేలా పనులు వేగంగా చేపట్టాలని లోకేశ్, రామానాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కొల్లేరులోకి భారీగా వరద నీరు.. కొల్లేరు సరస్సులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. బుడమేరు, రామిలేరు, తమ్మిలేరుల ప్రవాహాలరాకతో విజయవాడను ముంచెత్తిన బుడమేరు.. కొల్లేరులో కలుస్తుంది. నూజివీడు, దెందులూరులో నష్టం మిగిల్చిన రామిలేరు వరద ప్రవాహం.. ఏలూరు మీదుగా ఉదృతంగా ప్రవహిస్తూ కొల్లేరులో చేరుతుంది. ఏరులన్నీ కొల్లేరులో కలుస్తుండటంతో కొల్లేరు సరస్సు నిండిపోయింది. మెడికల్ వ్యర్థాలుకూడా రావడంతో కొల్లేరులో మత్స్య సంపద, పక్షులకు ముప్పు పొంచిఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు – కైకలూరు, ఏలూరు – గుడివాకలంక ప్రధాన రహదారులపైకి కొల్లేరు నీరు చేరింది. కోమటిలంక, పైడిచింతపాడు గ్రామాలను వరదనీరు చుట్టుముడుతుంది. కొల్లేరు ముంపు ప్రాంతాల్లో ముందస్తు సహాయక చర్యలకు అధికారులను జిల్లా కలెక్టర్ వెట్రీసెల్వీ ఆదేశించారు.
Admin
Studio18 News