Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Vijayawada Floods: కుంభవృష్టి వర్షాలతో విజయవాడ విలవిల లాడుతోంది. బెజవాడ మొత్తం వరద నీటిలో చిక్కుకుపోయింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో బెజవాడ వాసులకు కష్టాలు రెట్టింపయ్యాయి. కృష్ణా నదిలోకి భారీగా నీరు చేరుతుండడంతో భవానిపురానికి వరద ముప్పు పొంచివుంది. ఇప్పటికే కొన్ని కాలనీలో నీటిలో ముగినిపోయాయి. ప్రకాశం బ్యారేజ్ ఎగువ వాటర్ పున్నమి ఘాట్ వద్ద రోడ్డు పైకి చేరుతోంది. సహాయ సిబ్బంది ఇసుక బస్తాలతో నీటిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా నది మహోగ్రరూపంతో కరకట్ట వాసులు భయం భయంగా గడుపుతున్నారు. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలోకి కూడా నీట మునిగింది. జల విలయంతో బెజవాసులు బిక్కుబిక్కు ఇబ్రహీంపట్నం పరిధిలో పలు గ్రామాలు వరదల్లో మునిగిపోయాయి. జల విలయంతో ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. తమను రక్షించాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. అధికారులెవరూ ఇటువైపు రాకపోవడంతో వరద గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. పశ్చిమ ఇబ్రహీంపట్నం వద్ద నేషనల్ హైవే పైకి వరద నీరు చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. రెండు రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో గొల్లపూడిలోని సాయిపురం కాలనీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కరెంటు, వాటర్ లేకపోవడంతో అపార్ట్‌మెంట్ వాసులు ఖాళీచేసి వెళ్లిపోతున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కృష్ణా నదికి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11,39,351 క్యూసెక్కలుగా నమోదయింది. కాగా, కేంద్రం నుంచి ప్రత్యేకంగా 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడ చేరుకుంటున్నాయి. పంజాబ్(4), తమిళనాడు(3), ఒడిశా(3) రాష్ట్రాల నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పిస్తున్నారు. మరో 4 చాపర్స్ కూడా విజయవాడ రానున్నాయి. సహాయక చర్యల్లో మంత్రులు వరద ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భయాందళోనకు గురికావొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని కోరారు. కాగా, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పార్థసారథి సోమవారం విజయవాడ కలెక్టరేట్‌కు చేరుకుని.. వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా వచ్చే సమాచారంతో క్షేత్రస్థాయికి సహాయక బృందాలను పంపిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ఉదయం నుంచీ వరుస పర్యటనలు చేస్తున్నారు. రామలింగేశ్వర నగర్ లో రోడ్లపైకి కృష్ణా నది వరద చేరుతున్న ప్రాంతాలు పరిశీలించారు. ఇళ్ల మధ్యకు నీరు రాకుండా చర్యలు చేపట్టాలని VMC అధికారులకు ఆదేశించారు. భూపెష్ గుప్తా నగర్ లో ముంపు బారిన పడిన ప్రాంతాలను పరిశీలించి.. లోతట్టు ప్రాంతాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
Admin
Studio18 News