Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నైట్ డ్యూటీ చేసి ఉదయాన్నే ఇంటికి బయలుదేరిన ఓ ఏఎస్సై మార్గమధ్యంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. యూనిఫాం విప్పి జాగ్రత్తగా పక్కన పెట్టి రైలు కిందపడి చనిపోయాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లాలోని కమలాపురం పోలీస్ స్టేషన్ లో నాగార్జున రెడ్డి ఏఎస్సైగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి విధుల్లో ఉన్న నాగార్జున రెడ్డి.. బుధవారం ఉదయం డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. కానీ ఇంటికి మాత్రం చేరుకోలేదు. మార్గమధ్యంలో వల్లూరు మండలం తాటిగొట్ల సమీపంలోని తప్పెట్ల బ్రిడ్జి వద్ద రైలు పట్టాలపై నాగార్జున రెడ్డి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పట్టాలకు దగ్గర్లోనే నాగార్జున రెడ్డి యూనిఫాం పడి ఉందని, ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని పోలీసులు చెప్పారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Admin
Studio18 News