Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : నెల్లూరు శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్ ధావన్ సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథి పాల్గొన్నారు. ఇస్రో ఆధ్వర్యంలో గతనెల 14 నుంచి ఈ నెల 15 వరకు ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. భారతదేశ కీర్తి, ప్రతిష్ఠలను పెంచుతున్న ఇస్రోకు హ్యాట్సాఫ్ అని అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు కంటికి కనిపించే దేవుళ్లని, అందులో పనిచేసే ప్రతి శాస్త్రవేత్తకు సెల్యూట్ అని చెప్పారు. మనం సినిమా హీరోలకు కొట్టే చప్పట్ల కంటే ఇస్రో శాస్త్రవేత్తలకు అధికంగా చప్పట్లు కొట్టాలని అన్నారు. చంద్రుడిపైకి ఉపగ్రహాలను పంపి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇస్రోకు మనమందరం రుణపడాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు మన దేశానికి నిజమైన హీరోలని, హాలీవుడ్ తీస్తున్న సినిమాల ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో చంద్రయాన్ రాకెట్ ప్రయోగం విజయవంతం చేసిన ఇస్రోకు శుభాకాంక్షలని చెప్పారు. ఈ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని అన్నారు.
Admin
Studio18 News