Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Gossip Garage : జగనన్న సైన్యం ఎందుకు చెల్లాచెదురవుతోంది? జగన్ నమ్మిన బంటు అనుకున్న నేతలే హ్యాండిస్తారన్న ప్రచారానికి కారణాలేంటి? అధికారం పోవడంతోనే అంతా అయిపోయిందనుకుంటున్నారా? ఇక పార్టీకి భవిష్యత్తే లేదని భావిస్తున్నారా? లేక పార్టీ ఫిరాయింపులకు ఇంకేదైనా వ్యూహం ఉందా? అధినేత అనుమతితోనే కొందరు పార్టీ మారుతున్నారన్న ప్రచారంలో నిజమెంత? అప్పుడు టీడీపీ బాటలోనే ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యులు నడుస్తున్నారా? వైసీపీ రాజ్యసభ సభ్యుల పార్టీ మార్పులో అసలు వాస్తవాలు ఏంటి? మొత్తం 11 మంది ఎంపీల్లో మిగిలేది ఇద్దరేనా…? వైసీపీకి రాజ్యసభ సభ్యులు రాం రాం చెప్పేస్తారన్న ఊహాగానాలు పొలిటికల్ సర్కిల్స్‌లో హీట్ పుట్టిస్తున్నాయి. వైసిపికి ఉన్న మొత్తం 11 మంది ఎంపీల్లో వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి తప్ప మిగిలిన 9 మంది పార్టీ ఫిరాయిస్తారన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రచారానికి తగ్గట్టే ఇద్దరు ఎంపీలు గురువారం రాజీనామాలు సమర్పించారు. జగన్ నమ్మిన బంటు అనుకున్న మోపిదేవి వెంకటరమణ, వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ నుంచి వచ్చిన బీద మస్తాన్‌రావు ప్రస్తుతానికి రాజీనామాలు చేయగా, వీరి బాటలో మరో ఏడెనిమిది మంది గోడ దూకేస్తారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ మార్పుపై ప్రచారాన్ని ఖండించిన విజయసాయిరెడ్డి.. వైసీపీ రాజ్యసభాపక్ష నేత విజయసాయిరెడ్డితోపాటు జగన్‌కు అత్యంత విశ్వాసపాత్రులుగా చెప్పే అయోధ్యరామిరెడ్డి, జగన్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి, ఆయన సొంత జిల్లాకు చెందిన మేడా రఘురామిరెడ్డితోపాటు బీసీ నేత ఆర్.కృష్ణయ్య తదితరులు బీజేపీకి వెళతారని ప్రచారం జరుగుతోంది. పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాన్ని విజయసాయిరెడ్డి ఖండించగా, మిగతా వారు ఎవరూ ఇప్పటివరకు నోరు విప్పలేదు. తాను జగన్‌తోనే ప్రయాణిస్తానని విజయసాయిరెడ్డి చెప్పినా… ప్రత్యర్థులు మాత్రం విజయసాయిరెడ్డి బీజేపీలో చేరిపోతారంటూ చేస్తున్న ప్రచారానికి తెర దించడం లేదు. టీడీపీలోకి పిల్లి సుభాష్‌చంద్రబోస్, గొల్ల బాబూరావు? ఇదే సమయంలో పిల్లి సుభాష్‌చంద్రబోస్, గొల్ల బాబూరావు టీడీపీకి వెళతారని చెబుతున్నారు. ప్రజాక్షేత్రంలో పని చేయాలనుకుంటున్న వారు టీడీపీలో.. పరోక్ష రాజకీయాలు చేసే నేతలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మోపిదేవి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, గొల్ల బాబూరావు, బీద మస్తాన్‌రావు గతంలో ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉన్న వారే. ఎన్నికల ముందు మార్పుల్లో భాగంగా గొల్ల బాబూరావుకు రాజ్యసభ సభ్యత్వమిచ్చి సర్దుబాటు చేయగా, మిగిలిన ముగ్గురు 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వారు. వీరు గత ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా, పార్టీ అవకాశమివ్వలేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి మోపిదేవి, బోస్, గొల్ల బాబూరావు వంటి వారు అసంతృప్తితో రగిలిపోతున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు అవకాశం చూసుకుని గోడ దూకేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. రాజ్యసభ సభ్యత్వంపై ఆశ లేదని చెబుతున్న వైసీపీ మాజీ నేతలు.. తమలో ఏ ఒక్కరికీ రాజ్యసభ సభ్యత్వంపై ఆశ లేదని… రాష్ట్రంలో ఏదో ఒక పదవి ఇస్తే రాజీనామా చేసేస్తామని కూటమి అధికారంలోకి వచ్చిన నుంచి ఈ నలుగురు సంకేతాలు పంపుతున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రస్తుతం తమ నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు పోటీగా నిలబడమని, కొత్త నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయం చూసుకుంటామని ప్రతిపాదన పెట్టడంతో టీడీపీ కూడా సమ్మతించిందని అంటున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన మోపిదేవి సొంత నియోజకవర్గం రేపల్లెలో.. ప్రస్తుతం రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సత్యప్రసాద్‌కు రేపల్లె వదిలేసేందుకు మోపిదేవి అంగీకరించడంతో ఆయన చేరికకు సత్యప్రసాద్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇక బీద మస్తాన్‌రావు గతంలో టీడీపీలో పని చేసిన వారు కావడం, ఆయన కుటుంబానికి పార్టీతో తొలి నుంచి సంబంధాలు ఉండటంతో ఆయన చేరికపై ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతున్నారు. ఇక బోస్, గొల్ల బాబూరావు విషయంలో ఆయా జిల్లాల నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. బీజేపీలో తమ నేతలు ఉంటే భవిష్యత్‌లో సమస్యలు ఉండవనే ఎత్తుగడ..? ఇకపోతే మాజీ సీఎం జగన్ సొంత సామాజికవర్గానికి చెందిన రాజ్యసభ సభ్యులు… జగన్‌కు వెన్నుదన్నుగా నిలుస్తారని భావించిన నలుగురు బీజేపీకి వెళతారనే ప్రచారమే అందరిలో ఆసక్తికి కారణమవుతోంది. వీరి పార్టీ మార్పునకు గతంలో టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరినప్పటి అంశానికి లింకు పెడుతున్నారు కొందరు విశ్లేషకులు. కూటమికి తిరుగులేని మెజార్టీ ఉండటం.. కేంద్రంలో సీఎం చంద్రబాబుకు ప్రాధాన్యం పెరగడంతో జగన్ పాత కేసులను తెరపైకి తెచ్చి ఒత్తిడి పెంచే అవకాశం ఉందని భావిస్తోంది వైసీపీ. ఈ ఇబ్బందులు అధిగమించాలంటే బీజేపీతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటూనే… బీజేపీలో తమ నేతలు ఉంటే భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రావని భావిస్తోందని అంటున్నారు. టీడీపీ అనుసరించిన వ్యూహాన్నే వైసీపీ అమలు చేస్తోందా? గతంలో టీడీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు వెళ్లగా, ఆ ముగ్గురు చంద్రబాబు కోసం కేంద్రంలో లాబీయింగ్ చేయడానికే బీజేపీకి వెళ్లారని పదేపదే ప్రచారం చేసింది వైసీపీ. ఆ విమర్శల్లో నిజం ఉందో లేదో కానీ, గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తునకు ఆ ముగ్గురే కారణమని ఇప్పటికీ ఆరోపిస్తుంది వైసీపీ. ఈ పొత్తు వల్లే ఎన్నికల ముందు టీడీపీ-జనసేనకు గరిష్ట స్థాయిలో ప్రయోజనం దక్కిందనే విశ్లేషణలు ఉన్నాయంటున్నారు. దీంతో గతంలో టీడీపీ అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు వైసీపీ కూడా అమలు చేయాలని భావిస్తోందని అంటున్నారు. తమ అవసరాల కోసం కొందరు.. అధినేత ఆలోచనతో మరికొందరు? ఇలా పార్టీ వీడాలని నిర్ణయించుకున్న వారిలో కొందరు తమ అవసరాల కోసం.. మరికొందరు అధినేత ప్రయోజనం కోసం ఇతర పార్టీల్లోకి జంప్ చేయాలని చూస్తున్నారని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి గతంలో టీడీపీకి ఒక్క రాజ్యసభ సభ్యుడు మిగిలినట్లు… ఇప్పుడు వైసీపీ కూడా ఒకరినో… ఇద్దరినో పార్టీ అవసరాలకు ఉంచుకుని.. మిగిలిన వారిని బీజేపీలోకి పంపేయాలని భావిస్తోందని అంటున్నారు. ఐతే అధినేత అంతరంగాన్ని పసిగట్టిన మోపిదేవి వంటి వారు… బీజేపీలోకి వెళితే రాజకీయంగా నష్టపోతామని క్షేత్రస్థాయిలో పట్టు కోల్పోతామని లెక్కలు వేసుకుని టీడీపీని ఆశ్రయించినట్లు చెబుతున్నారు.
Admin
Studio18 News