Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : AP Rains : విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. పంజాబ్ రాష్ట్రంలోని లుదియాన నుంచి వరద బాధితుల సహాయర్థం ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి 126 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. ఒక హెలికాప్టర్లో వరద బాధితులకు, ఆహారం, తాగునీరు, ఎనర్జీ ఫుడ్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రానికి మరో నాలుగు హెలికాప్టర్లు గన్నవరం చేరుకోనున్నాయి. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టామని చెప్పారు. సహాయక చర్యలలో భాగంగా ఇంకా వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి, వారికి ఆహారం, తాగునీరు, ఎనర్జీ ఫుడ్స్ అందజేయడం జరుగుతుందని లక్ష్మీకాంత్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయం నుండి ఆర్మీ విమానం హెలికాప్టర్లలో వరద బాధితులకు ఆహారం, నీరు, ఎనర్జీ ఫుడ్స్ పంపడం జరిగింది. వరద బాధితులకు ఆహారం అందజేసి తిరిగి వచ్చే క్రమంలో.. ఉప్పులూరు గ్రామానికి చెందిన సుబ్బారావు అనేవ్యక్తి కరకట్ట పెద్దలంకలో బంధువుల ఇంటి వద్దకు వెళ్లే క్రమంలో చిక్కుకుపోయాడు. ఆ వ్యక్తిని గమనించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. అతన్ని రక్షించి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి తీసుకెళ్లారు. వరదల్లో రక్షించబడ్డ సుబ్బారావు మాట్లాడుతూ.. నేను ఎన్నడూ చూడని విధంగా వరదలొచ్చాయి. వరదల్లో చిక్కుపోయిన నేను బతకని అనుకున్నాను. నన్ను కాపాడి తీసుకు వచ్చినందుకు అధికారులకు, నాయకులకు రుణపడి ఉంటానని అన్నారు.
Admin
Studio18 News