Studio18 News - ANDHRA PRADESH / : ఈ నెల 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లన్నీ పటిష్ఠంగా చేపట్టాలని ఆదేశించారు. అదే రోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో జరగనున్న ‘ఎట్ హోం’ కార్యక్రమానికి సంబంధించి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మొత్తం ఏర్పాట్లన్నిటినీ ప్రోటోకాల్ విభాగం, ఎన్టీఆర్ జిల్లా కలక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖలను సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు శాఖల వారీగా ప్రత్యేక శకటాల ప్రదర్శనను ఏర్పాటు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజ్ భవన్, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం సహా ఇతర ప్రముఖ కార్యాలయాలు, చారిత్రక భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. ఒక వేళ వర్షం కురిసినా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో వర్చువల్‌గా రాష్ట్ర సాధారణ పరిపాలన (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, శాంతి భద్రతల ఐజీ శ్రీకాంత్, ఎన్టీఆర్ జిల్లా కలక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News