Studio18 News - ANDHRA PRADESH / : AP Rains : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇవాళ సాయంత్రం వరకు ఒడిశాలోని పూరీ సమీపంలో తీరందాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల్లో ఒడిశా, ఛత్తీస్ గడ్ వైపు ప్రయాణించనుంది. ఈ క్రమంలో మూడు రోజులు కాస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ముఖ్య అధికారిణి స్టెల్లా తెలిపారు. వాయుగుండం తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, గంటకు గరిష్టంగా 60 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల కారణంగా గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉంటుందని, ఈ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలను వణికిస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ పట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఏపీలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తాండవ జలాశయం వరద రహదారిపై పొంగి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఉప్పరగూడెం – గన్నవరం మెట్ట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. కల్యాణపురంలోని జలాశయం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నాలుగు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నర్సీపట్నం – తుని మధ్య వాహన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. భారీ వర్షాల దృష్ట్యా ముందుజాగ్రత్తగా రాకపోకలను నిలిపివేశారు.
Admin
Studio18 News