Studio18 News - ANDHRA PRADESH / : భారీ వరదలు తెలుగు రాష్ట్రాలను వణికించిన విషయం తెలిసిందే. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు సహాయ చర్యలు ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించడం, నేరుగా వరద బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. బాధితులు పస్తులు ఉండకుండా డ్రోన్లను ఉపయోగించి ఆహారాన్ని అందించారు. ఇలా డ్రోన్ సహాయంతో వరద బాధితులకు ఆహారాన్ని అందించిన ఫొటోలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై జనసేనాని ప్రశంసలు కురిపించారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేందుకు వినూత్న మార్గాలను అన్వేషించే చంద్రబాబును తప్పకుండా అభినందించాలని ట్వీట్ చేశారు. "డ్రోన్ల ద్వారా వరద బాధితుల బాధలను ఎలా తగ్గించవచ్చో ఈ ఫొటోలను చూస్తుంటే మనకు అర్థమవుతోంది. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేందుకు వినూత్న మార్గాలను అన్వేషించే ముఖ్యమంత్రి చంద్రబాబును మనం తప్పకుండా అభినందించాలి. మీ నుంచి చాలా నేర్చుకోవాలి సర్. ఏపీలో మీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అందరికీ స్ఫూర్తినిస్తుంది" అని పవన్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
Admin
Studio18 News