Studio18 News - ANDHRA PRADESH / : Anagani Satya Prasad: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కీలక దస్త్రాలు కాలిపోయినట్లు తెలుస్తోంది. కొత్త సబ్‌కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి ముందు జరిగిన ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిని కప్పిపుచ్చేందుకే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అన్నారు. ఆ కార్యాలయం మొన్నటి వరకు పెద్దిరెడ్డి నియంత్రణలోనే ఉందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున ల్యాండ్ కన్వెర్షన్ జరిగిందని ఆరోపించారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ ప్రశ్నించిన తర్వాతే సబ్ కలెక్టర్ కార్యాలయ దగ్దం ఘటన జరిగిందని సత్యప్రసాద్ తెలిపారు. పెద్దిరెడ్డి మీద, స్థానిక వైసీపీ నేతల మీదే తమకు అనుమానం ఉందని చెప్పారు. ఆదివారం ఉద్యోగులు పని చేయడం ఎందుకని నిలదీశారు. ఆర్డీవో, ఎమ్మార్వోతో పాటు ఇతర ఉద్యోగులు, అధికారుల మొబైల్స్ సీజ్ చేశామని చెప్పారు. ఈ ఘటనలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించబోమని సత్యప్రసాద్ అన్నారు. అవినీతి ఆరోపణలు వస్తున్న వేళ ఫైళ్లు మాయం అవుతున్నాయని లేదంటే దగ్దం అవుతున్నాయని తెలిపారు. ఉద్యోగులు పని చేస్తే సరిగ్గా చేయాలని, లేదంటే పక్కకు తప్పుకోవాలని, గత వైసీపీ ప్రభుత్వ అవినీతిని కప్పి పుచ్చేలా ఉద్యోగులు సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఘటనపై విచారణ కాగా, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావు వెళ్లారు. అగ్ని ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఎవరైనా నిప్పు పెట్టారా లేక షార్ట్ సర్క్యూట్ కు అవకాశం ఉందా అన్న కోణంలో విచారణ జరుగుతోంది.
Admin
Studio18 News