Studio18 News - ANDHRA PRADESH / : Vijayawada Flood : గత మూడు రోజులుగా ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీనికితోడు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా బుడమేరు, కృష్ణా నదిలోకి వరద నీరు పోటెత్తింది. బుడమేరులోకి గతంలో ఎప్పుడూలేని స్థాయిలో వరదనీరు చేరడంతో విజయవాడలోని పలు డివిజన్లలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ఇల్లు మునిగిపోగా.. పలు ప్రాంతాల్లో అపార్ట్ మెంట్ లలోకి పెద్దెత్తున వరదనీరు చేరింది. వరదల్లో చిక్కుకున్న వారికి ఏపీ ప్రభుత్వం ఆహారం, తాగునీరు అందిస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజులుగా రాత్రిపగలు తేడాలేకుండా వరద ముంపు ప్రాంతాల్లో బోట్లలో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని బోటుల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి వరద ముంపు ప్రాంతాలు కొద్దికొద్దిగా తేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు ఆందోళన కలిగించే వార్తను వాతావరణ శాఖ తెలిపింది. ఏపీకి తుఫాన్ ముప్పు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 5, 6 తేదీల్లో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ ప్రాంతంలో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశంఉందని, ఇది తుపానుగా మారి విశాఖ – ఒడిశా దిశగా ప్రయణించి తీరందాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరికొద్దిరోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే మరో అల్పపీడనం ఏర్పడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో బలహీనపడిన వాయుగుండం తూర్పు విదర్భ, తెలంగాణ పరిసరాల్లో కొనసాగుతుంది. అల్పపీడనం రాబోయే 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు 19మంది మరణించగా, ఇద్దరు గల్లంతైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. 136పశువులు మృతి చెందినట్లు తెలిపింది. 1,72,542 హెక్టార్ల వరి, 14,959 హెక్టార్ల ఉద్యాన పంటలు, 1,808KM మేర రోడ్లు నాశనమైనట్లు పేర్కొంది. 176 పునరావాస కేంద్రాలకు 41,927మందిని తరలించామని, బాధితులకు మూడు లక్షల ఆహార ప్యాకెట్లు అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సాయం కోసం 112, 1070, 18004250101 నంబర్లకు కాల్ చేయాలని ప్రభుత్వం సూచించింది.
Admin
Studio18 News