Studio18 News - ANDHRA PRADESH / : Rain Alert AP and Telangana : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావం వల్ల అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రోణంకి కూర్మనాథ్ తెలిపారు. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి శుక్రవారం వాయవ్యంలో కేంద్రీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. శుక్రవారం అదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అదేవిధంగా 31వ తేదీన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో.. సెప్టెంబర్ 1వ తేదీన నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
Admin
Studio18 News