Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులను నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మొత్తం రూ. 36.5 కోట్లతో నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌సీసీ) సంస్థ ఈ పనులను టెండర్ ద్వారా దక్కించుకున్నట్టు తెలిపారు. మొత్తం 23,429 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత సచివాలయం వెనుక వైపు నుంచి జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే తాడికొండ శ్రావణ్ కుమార్‌తో కలిసి ప్రత్యేక పూజల అనంతరం స్వయంగా పొక్లెయిన్‌ను ఆపరేట్ చేసి పనులను ఆయన ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి విశాఖపట్నం, కర్నూలు, అమరావతి అంటూ రైతులను ఇబ్బంది పెట్టిందని మంత్రి విమర్శించారు. మొత్తం 58 వేల ఎకరాలు అమరావతి పరిధిలో ఉండగా 24 వేల ఎకరాల్లో దట్టమైన అడవిలా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని అన్నారు. వెంటనే కంపలు తొలగించాలన్న సీఎం ఆదేశాలతో పనులు ప్రారంభించామని తెలిపారు. 30 రోజుల్లోగా పనులు పూర్తి చేసేలా టెండర్ల ప్రక్రియ పూర్తిచేశామని అన్నారు. అమరావతి పనులకు ఇది మొదటి అడుగు అని మంత్రి అన్నారు. జంగిల్ క్లియరెన్స్ పూర్తయితే రైతులు తమకు వచ్చిన రిటర్నబుల్ ప్లాట్‌లు ఎక్కడ ఉన్నాయో చూసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
Admin
Studio18 News