Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Gossip Garage : అప్పుడు ఓడాం.. ఇప్పుడు పవర్ లో ఉన్నాం.. దెబ్బకు దెబ్బ వైసీపీ అబ్బ అనాల్సిందే.. ఇదే కసితో ఉంది కూటమి. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలను లైట్ తీసుకున్న టీడీపీ.. ఇప్పుడు ఒక్కో మున్సిపాలిటీ, కార్పొరేషన్, జెడ్పీలో జెండా పాతేందుకు పక్కా ప్లాన్ అమలు చేస్తోంది. వస్తాం సర్ తీసుకోండి అంటున్నా.. అందరికీ కండువా కప్పేయడం లేదు. అవసరం ఉన్నా, వారి మద్దతు తప్పనిసరి అయినా గతం సర్కార్ హయాంలో ఓవర్ చేసిన వారిని పక్కకు పెట్టేస్తోంది టీడీపీ. కడప జెడ్పీ పీఠంపై ఆపరేషన్ కంటిన్యూ చేస్తూనే తిరుపతి మేయర్ సీటుపై ఫోకస్ పెట్టింది సైకిల్ పార్టీ. టీడీపీ, జనసేనలో చేరేందుకు వైసీపీ కార్పొరేటర్లు రెడీ..! అది మేయర్ పీఠమైనా.. మున్సిపల్ ఛైర్మన్ అయినా.. జడ్పీ కుర్చీ అయినా మనదే అయి ఉండాలంటోంది కూటమి సర్కార్. ఓడిన కసితో పాగా వేసి మరీ తీసుకోవాలని ఫిక్స్ అయింది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు అసలే లేవంటూ తిరుపతి కార్పొరేషన్‌లో అసలైన రాజకీయానికి తెరలేపింది. తిరుపతి మేయర్ పదవి ప్రస్తుతం వైసీపీ చేతిలో ఉంది. డిప్యూటీ మేయర్ పీఠం ఖాళీ ఉంది. దీంతో కౌన్సిల్‌పై ఆధిపత్యం కోసం కూటమి నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందుకు తగ్గట్లుగానే పెద్ద సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ- జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఎన్నికల్లో పోటీ కోసం భూమన అభినయ్‌రెడ్డి రాజీనామా చేసిన డిప్యూటీ మేయర్ పదవిని చేజక్కించుకునేందుకు కూటమి నేతల్లోనూ పోటీ మొదలైంది. టీడీపీ, జనసేన నేతలు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తిరుపతి మేయర్ వైసీపీలోనే కొనసాగుతారా లేక కూటమిలో చేరుతారా.. తిరుపతి వైసీపీ కార్పొరేటర్ల దారెటు అన్నది ఉత్కంఠ రేపుతోంది. తమను నామినేషన్ కూడా వేయనివ్వలేదని టీడీపీ ఆరోపణ.. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో 50 స్థానాలు ఉండగా.. 49 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు టీడీపీ కేవలం ఒక్క స్థానాన్ని కైవసం చేసుకుంది. మిగిలిన 48 స్థానాలు వైసీపీ ఖాతాలో ఉన్నాయి. తమను నామినేషన్ కూడా వేయనివ్వకుండా నాటి అధికార వైసీపీ నేతలు కార్పొరేటర్లను ఏకగ్రీవం చేసుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. జనరల్ మహిళ రిజర్వ్ స్థానమైన తిరుపతి మేయర్ పీఠం.. బీసీ వర్గానికి చెందిన డాక్టర్ శిరీష యాదవ్‌ను వరించింది. నాటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయ్ రెడ్డి నాల్గవ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఏకగ్రీవంగా గెలిచి, తర్వాత డిప్యూటీ మేయర్ అయ్యారు. తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ దక్కడంతో భూమన అభినయ్ రెడ్డి డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేశారు. వివాదరహితులైన వారిని మాత్రమే చేర్చుకోవాలని టీడీపీ-జనసేన భావన.. సార్వత్రిక ఎన్నికలకు ముందే ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేన కూటమిలో చేరారు. రాష్ట్రంలో అధికారం మారాక తిరుపతి కార్పొరేషన్‌లోనూ రాజకీయంగా మార్పులు స్టార్ట్ అయ్యాయి. పెద్ద సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ- జనసేనలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టీడీపీ, జనసేన అధిష్టానం తిరుపతి కార్పొరేటర్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. వైసీపీ కార్పొరేటర్లలో చాలామంది టీడీపీ నేతలను ఇబ్బందులు పెట్టిన వారున్నారు. వారిని పక్కన పెట్టి వివాదరహితులైన వారిని మాత్రమే చేర్చుకోవాలని టీడీపీ-జనసేన అధిష్టానం భావిస్తోంది. ఆ మేరకు 25 మందితో ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 6 నెలల తర్వాతే అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం.. ఎలాగైనా తిరుపతి కార్పొరేషన్‌లో పాగా వేయాలని భావిస్తోంది కూటమి. అయితే ప్రస్తుత నగర మేయర్ వైసీపీకి చెందిన డాక్టర్ శిరీష విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఆమె పార్టీ మారడానికి అంత సుముఖంగా లేరని ప్రచారం జరుగుతోంది. ఇంకో ఆరు నెలలు ఆగితే మేయర్ పదవీ కాలం నాలుగేళ్లు పూర్తి అవుతుంది. ఆ తర్వాతే ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంటుంది. అలా జరిగినా, అవసరమైతే పదవి కోల్పోయి కార్పొరేటర్‌గానే కొనసాగాలని మేయర్ శిరీష భావిస్తున్నారు. సౌమ్యురాలు అయిన డాక్టర్ శిరీష పట్ల టీడీపీ- జనసేన కూటమి నేతల్లోనూ సానుకూలత ఉంది. ఆమెను ఇబ్బంది పెట్టే ఆలోచన చేయడం లేదు. మరోవైపు ఆరు నెలల తర్వాత మేయర్ పీఠం చేజిక్కించుకోవాలని నగరానికి చెందిన బీసీ నేత రామచంద్ర యాదవ్ భావిస్తున్నారు. ఆయన కుమార్తె అనిత ప్రస్తుతం కార్పొరేటర్‌గా ఉన్నారు. తన కూతురును మేయర్‌గా చేయాలని ఆయన భావిస్తున్నారు. పరిణామాలన్నీ అనుకూలిస్తే అనిత మేయర్ అయ్యే అవకాశం ఉంది. డిప్యూటీ మేయర్ పదవి రేసులో ఎమ్మెల్యే కొడుకు? మరోవైపు ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవిపై కూటమి నేతల కన్ను పడింది. పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన ముఖ్యనేతలు డిప్యూటీ మేయర్ పదవి చేజిక్కించుకోవాలని పోటీ పడుతున్నారు. ప్రస్తుత తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు డిప్యూటీ మేయర్ పదవి విషయంలో చక్రం తిప్పాలని చూస్తున్నారు. తన కుమారుడు ఆరణి మదన్ ను రాజకీయంగా తెరపైకి తెస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే శ్రీనివాసులు వారసుడుగా ఆయన తనయుడు మదన్ బరిలో ఉంటారని అప్పుడే నగరంలో ప్రచారం మొదలైంది. డిప్యూటీ మేయర్ పదవి విషయంలోనూ మదన్ పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే కుటుంబీకులు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. డిప్యూటీ మేయర్ పదవి కోరుతున్న సుగుణమ్మ.. ఇక టీడీపీ తరఫున టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తన మనవరాలు కీర్తిని డిప్యూటీ మేయర్ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తద్వారా తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె పార్టీని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవి తనకి ఇవ్వాలని ఏకైక టీడీపీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ కోరుతున్నారు. జనసేన నుంచి కూడా కొంతమంది డిప్యూటీ మేయర్ పదవి కోసం పోటీలో ఉన్నారు. ఇలా తిరుపతి రాజకీయం మొత్తం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కేంద్రంగానే కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకో మూడు, నాలుగు నెలలు విశ్రాంతి తీసుకొని, ఆ తర్వాత పొలిటికల్‌గా యాక్టివ్ కావాలని భూమన కుటుంబం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Admin
Studio18 News