Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా రూపొందించిన 'కమిటీ కుర్రోళ్లు' ఈ నెల 9వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో విడుదలయింది. యధూ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురి చేసింది. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను సాధిస్తోంది. అసలు ముఖ పరిచయమే లేని నటులు, కనీసం పేరు కూడా తెలియని డైరెక్టర్ అయినా కానీ బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. తను నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమాను తెలుగు ప్రేక్షకులు విజయవంతం చేయడంపై నిర్మాత నిహారిక ధియేటర్ లను సందర్శించి నేరుగా ప్రేక్షకులను కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల నంద్యాల, కర్నూల్ ధియేటర్ లను నిహారిక సందర్శించారు. సినిమా చూస్తున్న ప్రేక్షకులతో నేరుగా మాట్లాడారు. ఊహించని విధంగా తమ సినిమాకు రాయలసీమలోనూ వసూళ్లు బాగా రావడం గొప్ప విషయమని అన్నారు. ఇంతటి ఆదరణ చూసి తాను షాకయ్యానని చెబుతూనే.. తన సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక నిహారిక ధియేటర్ లకు రాకతో మెగా అభిమానులు, జనసైనికులు సంబరాలు చేస్తూ ఆమెకు ఘన స్వాగతం పలికారు. మెగా హీరోలు వస్తే ఏ విధంగా అయితే స్వాగతం పలుకుతారో అదే రీతిలో నిహారికను స్వాగతించారు. దీంతో కమిటీ కుర్రోళ్లు సినిమా నిహారికను సంతోషంలో ముంచెత్తుతోంది.
Admin
Studio18 News