Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ (ఈవీఎం) ల పనితీరుపై పలువురు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేయడం తెలిసిందే. ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి 12 పోలింగ్ కేంద్రాలపై వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆయా కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలలోని ఓట్లను రీకౌంటింగ్ చేయాలని అభ్యర్థించారు. ఇందుకోసం జూన్ 10న ఆయన రూ.5,66,400 ఫీజుగా చెల్లించారు. బొబ్బిలి శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి శంబంగి చిన అప్పలనాయుడు కూడా ఇదే రీతిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజాగా ఈవీఎంల పరిశీలనకు అంగీకరించింది. నిబంధనల మేరకు భెల్ ఇంజనీర్లతో డమ్మీ బ్యాలెట్ లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా వెల్లడించారు. ఫిర్యాదుదారుల సమక్షంలో ఈవీఎంలను పరిశీలిస్తామని వివరించారు. ఈ నెల 19 నుంచి 24 వరకు ఈ పరిశీలన కొనసాగుతుందని తెలిపారు.
Admin
Studio18 News