Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి, అరెస్టులు చేస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అరెస్ట్ చేయడాన్ని సుబ్బారెడ్డి ఖండించారు. అక్రమ అరెస్ట్ లపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఇంటిపైకి వరదనీరు రాకుండా నీటిని మళ్లించడం వల్లే బుడమేరుకు వరద వచ్చిందని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. దీనివల్ల విజయవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. వరద నష్టాలను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలను అరెస్టులు చేయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయిస్తోందని దుయ్యబట్టారు. వైసీపీ అధినేత జగన్ కు, మాజీ మంత్రి బాలినేనికి మధ్య ఎలాంటి విభేదాలు లేవని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైసీపీకి బాలినేని గుడ్ బై చెపుతున్నారనే ప్రచారంలో నిజం లేదని అన్నారు. ప్రజా సమస్యల గురించి చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్ మెంట్ అడిగారేమోనని చెప్పారు. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిని త్వరలోనే నియమిస్తామని తెలిపారు.
Admin
Studio18 News