Studio18 News - ANDHRA PRADESH / : శాసన సభలో సోమవారం గవర్నర్ ప్రసంగం ముగిశాక మంత్రి నారా లోకేశ్ బీజేపీ ఎమ్మెల్యేలను పలకరించారు. కాఫీ తాగుదామంటూ వారిని తన ఛాంబర్‌లోకి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బీజేపీలో చేరుతున్నారని ప్రచారం సాగుతోంది నిజమేనా? అంటూ టీడీపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి... బీజేపీ ఎమ్మెల్యేలను అడిగారు. తనకు తెలిసినంత వరకు అలాంటిదేమీ లేదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. కొందరు వైసీపీ నాయకులు బీజేపీలో చేరుతారనే చర్చ సాగుతోంది. ఇదే విషయాన్ని టీడీపీ నేతలు అడిగారు. వైసీపీ నుంచి ఎవరైనా పార్టీలో చేరేందుకు ముందుకు వస్తే కూటమి పక్షాల నేతలు కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటే మంచిదని పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. అలాగే, మూడు పార్టీలు సమన్వయంతో తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందన్న ప్రతిపాదన బీజేపీ ఎమ్మెల్యేల నుంచి వచ్చింది. ఈ ఆలోచన బాగుందని మంత్రి లోకేశ్ అన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే పాలన సజావుగా సాగేందుకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
Admin
Studio18 News