Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Pawan Kalyan : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్ తో బుధవారం ఉదయం ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో వరదల పరిస్థితిపై ఆరా తీశారు. ఏలేరు వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎగువన కురిసిన భారీ వర్షాలకారణంగా ఏలేరు, తాండవ రిజర్వాయర్లకు ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా 62వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయని పవన్ కల్యాణ్ కు కలెక్టర్ వివరించారు. గండ్లు పడటం, రహదారులపైకి నీటి ప్రవాహం చేరటం వల్ల పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో పిఠాపురం – రాపర్తి, పెద్దాపురం – గుడివాడ, సామర్లకోట – పిఠాపురం మార్గాల్లో రాకపోకలు స్తంభించాయని వివరించారు. గొల్లప్రోలు దగ్గర జాతీయ రహదారిపై ప్రవాహం ఎక్కువగా ఉన్నందున వాహనాలను దారి మళ్లించినట్లు పవన్ కల్యాణ్ కు కలెక్టర్ వివరించారు. వరద పీడిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు అవసరమైన పడవలు, సహాయక బృందాలు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయని, ఏలేరుకి వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోందని కలెక్టర్ తెలిపారు. బుధవారం ఉదయం 8గంటలకు 12,567 క్యూసెక్కుల ఇన్ ఫ్లోకి వచ్చేసిందని చెప్పారు. జలాశయం పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా ప్రస్తుతం 22.16 టీఎంసీ ఉందని వివరించారు. నాలుగు గేట్లు ఎత్తినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ దళాలతోపాటు ఆర్మీ బృందాల సేవలనుకూడా వినియోగించుకొని ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు సూచించారు. నివాస సముదాయాలను వరద చుట్టుముట్టిన చోట్ల అక్కడి ప్రజలకు తగిన ఆహారం, నీరు, పాలు అందించాలని స్పష్టం చేశారు. ఏలేరు వరదతో పంటలు కోల్పోయిన రైతులతో ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం మాట్లాడుతూ ధైర్యం చెప్పాలని కలెక్టర్ కు పవన్ కల్యాణ్ సూచించారు.
Admin
Studio18 News