Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : వైసీపీ అధినేత జగన్ నిన్న విజయవాడలో వరద పరిస్థితులను పరిశీలించిన సందర్భంగా... ఈ వరదలు మానవ తప్పిదం వల్లే వచ్చాయని ఆరోపించడం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కృష్ణా నది వరదల సందర్శనకు వచ్చారని, ఆ వరదలను మ్యాన్ మేడ్ డిజాస్టర్ (మానవ తప్పిదం కారణంగా ఏర్పడిన విపత్తు) అని సెలవిచ్చారని నాగబాబు వివరించారు. మూడేళ్ల కిందట అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి 44 మంది మృత్యువాత పడ్డారని, 15 మంది జాడ లేదని వెల్లడించారు. ఐదు గ్రామాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయని, వందలాది పశువులు చనిపోయాయని తెలిపారు. నాడు ఎటు చూసినా కూలిన ఇళ్లు కనిపించాయని, ఇంకా అనేకమంది గుడారాల మధ్యనే నివసిస్తున్నారని నాగబాబు తెలిపారు. "చెయ్యేరులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వుతారు. ఆ ఇసుక కోసం లారీలు నదిలోకి దిగుతాయి. డ్యామ్ గేట్లు ఎత్తితే ఆ లారీలు వరదలో చిక్కుకుపోతాయి. కాబట్టి... ఆ లారీలు నది నుంచి బయటికి వచ్చేంత వరకు డ్యామ్ గేట్లు ఎత్తనివ్వకుండా ఆపారన్నది ప్రధాన ఆరోపణ. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ లోపం వల్లనే అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని పార్లమెంటులో నాటి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఇది దేశంలో ఒక కేస్ స్టడీ అని కూడా ఆయన పేర్కొన్నారు. దీన్ని అంటారు సార్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని. మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి ఓసారి నేచురల్ డిజాస్టర్ కి, మ్యాన్ మేడ్ డిజాస్టర్ కి తేడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు డ్యామ్ గేటు సకాలంలో రిపేరు చేయకపోవడం వల్ల, మీ బృందం ఇసుక అక్రమంగా మితిమీరి రవాణా చేయడం వల్ల జరిగిన అన్నమయ్య డ్యామ్ ప్రమాదాన్ని మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని అంటారని గమనించగలరు. వీలైతే ముంపు ప్రాంతాల్లో పర్యటించి, వరదల ద్వారా ఆస్తులు నష్టపోయిన బాధితులను ఆర్థికంగా ఆదుకుంటే బాగుంటుంది. విమర్శలే కాదు, విపత్తు సమయంలో వీలైన సాయం కూడా చేస్తే బాగుంటుందని విన్నవిస్తున్నాను... మీ నాగబాబు" అంటూ ట్వీట్ చేశారు.
Admin
Studio18 News