Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : నటి కాదంబరి జెత్వానీని కట్టడి చేయడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్, పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ కలిసి ప్లాన్ చేశారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చి ఎదగాలనుకున్న జెత్వానీని మానసికంగా వేధించారని చెప్పారు. ఆమె కేసు పెట్టబోతే నిర్బంధించి వేధించారని అన్నారు. ఉన్నత కుటుంబానికి చెందిన జెత్వానీని ఇక్కడకు తీసుకొచ్చి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. జగన్ కు తెలియకుండానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తారా? అని షర్మిల ప్రశ్నించారు. ఇద్దరు కుమార్తెలు ఉన్న జగన్... జెత్వానీకి జరుగుతున్న అన్యాయంపై ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. సజ్జన్ జిందాల్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని జగన్ గొప్పగా చెప్పుకున్నారని గుర్తు చేశారు. జిందాల్ కు కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జగన్ ఎందుకు కట్టబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. జెత్వానీకి అండగా ఉండి, ఆమె కోసం పోరాడేందుకు తాను సిద్ధమని చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని షర్మిల విమర్శించారు. గత ఏడాది సీఎం హోదాలో స్టీల్ ప్లాంట్ కు జగన్ శంకుస్థాపన చేసినా... ఆ తర్వాత దాన్ని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. గుడ్లవల్లేరు కాలేజీలో సీక్రెట్ కెమెరాలు అనేది ఫేక్ ప్రచారం అని తాము భావిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరపున తమ టీమ్స్ వెళ్లి సర్వే చేస్తే అంతా ఫేక్ అని తేలిందని వెల్లడించారు. కెమెరాలు పెట్టినట్టు ఎవరైనా నిజాలు బయటపెడితే బాధితుల తరపున పోరాడతామని చెప్పారు.
Admin
Studio18 News