Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజని తనను వేధిస్తున్నారని పల్నాడు జిల్లా యడ్లపాడుకు చెందిన కోటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు వచ్చిన ఆయన ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రజని తన మరిది గోపీనాథ్ పేరుతో తమ వద్ద మూడెకరాల భూమి కొనుగోలు చేశారని, ఇంకా రూ. 25 లక్షలు ఇవ్వాల్సి ఉండగా రేపు, మాపు అని చెబుతూ వేధిస్తున్నారని కోటయ్య పేర్కొన్నారు. అలాగే, వైసీపీ బాధితులు మరికొందరు కూడా ఈ గ్రీవెన్స్‌లో వినతిపత్రాలు సమర్పించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. గత ప్రభుత్వం తమపై పెట్టిన అక్రమ కేసులు తొలగించాలని, కొత్త పింఛన్లు మంజూరు చేయాలని, గత ప్రభుత్వం రద్దు చేసిన పింఛన్లను పునరుద్ధరించాలని, రేషన్‌కార్డులు ఇవ్వాలని పలువురు వేడుకున్నారు. తాము 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని కొందరు వైసీపీ నాయకులు కబ్జా చేశారని, పొలంలో అడుగుపెడితే నరికేస్తామని బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని పల్నాడు జిల్లా బొల్లాపల్లికి చెందిన మహిళలు విజయనిర్మల, మేరీ వినతిపత్రం సమర్పించారు. తాము టీడీపీ వాళ్లమనే కక్షతో తమ కుటుంబపై గత ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని నెల్లూరు జిల్లా దగదర్తికి చెందిన పవన్‌కుమార్ ఫిర్యాదు చేశారు. గ్రీవెన్స్‌కు హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు వినతులు స్వీకరించారు.
Admin
Studio18 News