Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : భారత స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 1,439 పాయింట్లు లాభపడి 82,962 వద్ద... నిఫ్టీ 470 పాయింట్లు ఎగిసి 25,388 వద్ద స్థిరపడింది. 2,228 స్టాక్స్ లాభాల్లో... 1,564 స్టాక్స్ నష్టాల్లో ముగియగా, 103 స్టాక్స్‌లో ఎలాంటి మార్పు లేదు. సెన్సెక్స్ ఓ సమయంలో 1,500 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్, నిఫ్టీ ఈరోజు ఆల్ టైమ్ గరిష్ఠాన్ని తాకాయి. దీంతో మొదటిసారి సెన్సెక్స్ 83 వేల పాయింట్లను దాటింది. అయితే చివరకు ఈ మార్కుకు కాస్త దిగువన ముగిసింది. మార్కెట్ ర్యాలీతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6.6 లక్షల కోట్లు పెరిగి రూ.467.36 లక్షల కోట్లకు చేరుకుంది. నిఫ్టీ-50 స్టాక్స్‌లో హిండాల్కో, భారతీ ఎయిర్‌టెల్, ఎన్టీపీసీ లాభాల్లో ముగిశాయి. నెస్లే మాత్రమే నష్టాల్లో ముగిసింది. అన్ని రంగాలు కూడా ఈ రోజు లాభాల్లోనే ముగిశాయి. మెటల్స్, ఆటోమొబైల్స్, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ, పవర్ రంగాలు 2 శాతం నుంచి 4 శాతం వరకు లాభపడ్డాయి. మిడ్ క్యాప్ సూచీలు 1 శాతానికి పైగా లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీలు 0.8 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ మెటల్ 3 శాతానికి పైగా లాభపడింది. ఆగస్ట్ నెలకు సంబంధించి ద్రవ్యోల్బణం స్వల్పంగా 0.28 శాతం మేర పెరిగింది. అయినప్పటికీ ఫెడ్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందన్న అంచనాలు మార్కెట్‌కు ఊతమిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 72 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ప్రధానంగా చమురు దిగుమతులపై ఆధారపడిన మన దేశానికి ఇది సానుకూలం కావడంతో మార్కెట్‌కు దోహదపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు కలిసి వచ్చాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు క్రమంగా పెరుగుతుండటం కూడా మార్కెట్ దూకుడుకు కారణమైంది.
Admin
Studio18 News