Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : కృష్ణా నది వరదకు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజి వద్ద గేట్లను బలంగా ఢీకొట్టిన బోట్లు నష్టాన్ని కలిగించిన సంగతి తెలిసిందే. ఈ బోట్లు ఒకే రంగును కలిగి ఉండడం, ఒకే సమయంలో గేట్లను ఢీకొట్టడంపై అనుమానాలు ఉన్నాయంటూ సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలందరూ మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు మేరకు దీనిపై విజయవాడ వన్ టౌన్ పీఎస్ లో కేసు కూడా నమోదైంది. ఈ బోట్లు ఎవరివి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. ఈ నేపథ్యంలో, టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ప్రకాశం బ్యారేజిని కూల్చి విజయవాడను జలసమాధి చేయడానికి జగన్ రెడ్డి పన్నిన భారీ కుట్ర బట్టబయలైందని పేర్కొంది. ఆ బోట్లు... జగన్ నమ్మినబంటు, వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్ కి చెందినవని వెల్లడించింది. మూడు బోట్లను ఒకదానికి ఒకటి కట్టేసి, మూడింటిని కలిపి ఒకేసారి ప్రకాశం బ్యారేజి మీదకు వదిలారని ఆరోపించింది. సరిగ్గా... బ్యారేజికి 12 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్న సమయంలోనే ఇలా చేసి బ్యారేజిని కూల్చేయాలని జగన్ క్రిమినల్ ప్లాన్ వేశాడని టీడీపీ తన ట్వీట్ లో వివరించింది. అదృష్టవశాత్తు బ్యారేజికి ఎక్కువ నష్టం జరగలేదని పేర్కొంది. అయితే, పోలీసులు విచారణ మొదలుపెట్టడంతో వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్ పారిపోయాడని వెల్లడించింది. దీనిపై విచారణ కొనసాగుతోందని స్పష్టం చేసింది.
Admin
Studio18 News