Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఉపాధి కోసం ఎడారి దేశం వెళ్లిన ఓ తెలుగు మహిళ అక్కడ మోసపోయింది. ఉపాధి బదులు యజమాని ఆమెను నిర్బంధించాడు. దాంతో స్వదేశానికి తిరిగి వచ్చేందుకు తనకు సాయం చేయాల్సిందిగా ఆమె వేడుకుంది. తనను ప్రభుత్వం కాపాడాలని, స్వదేశానికి రప్పించేందుకు సహాయం చేయాలని కోరింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం పదో వార్డుకు చెందిన షేక్ మక్బుల్ బీ, ఖాదర్‌బాషా దంపతులు. ఇద్దరు పిల్లలున్న ఈ జంట రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే, గల్ఫ్ దేశాలకు వెళ్తే అక్కడ మంచి ఉపాధి దొరికి తమ జీవితాలు బాగుపడతాయని భావించిన మక్బుల్ బీ ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ఆమెకు హైదరాబాద్‌లో ఉండే ఓ ఏజెంట్ గురించి తెలిసింది. ఆ ఏజెంట్‌ను సంప్రదించడంతో ఆమెను మస్కట్ పంపించాడు. అక్కడ ఓ యజమాని వద్ద ఇంట్లో పని చేయాల్సి ఉంటుందని ఆగస్టు 25న మస్కట్ పంపారు. అయితే, అక్కడకు వెళ్లిన ఆమెకు రోజులు గడుస్తున్నప్పటికీ పని దొరకలేదు. పైగా ఆమెను ఓ గదిలో బంధించి ఒక పూటే ఆహారం ఇస్తూ ఇక్కట్లకు గురిచేస్తున్నారు. అక్కడి వారిని తనను స్వదేశానికి పంపించాలని కోరితే రూ. 1.50లక్షలు ఇవ్వాలని చెబుతున్నారంటూ ఆమె సెల్ఫీ వీడియా ద్వారా తన గోడును వెళ్లబుచ్చింది. ఎలాగైనా ప్రభుత్వం తనను కాపాడి, స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని మక్బుల్ బీ కన్నీటి పర్యంతమైంది.
Admin
Studio18 News