Studio18 News - ANDHRA PRADESH / : Nara Lokesh Reaction On Budget 2024 : 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సాయం ప్రకటించారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఏపీకీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీఇచ్చారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు, పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక రాయితీలు, విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం వంటివి ప్రకటించారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యం కల్పించడం పట్ల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త సూర్యోదయం అని తెలిపారు.‘బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలకు చాలా సంతోషిస్తున్నాను, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇవి ఏపీ అభివృద్ధి, సామాజిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి. మా పోరాటాన్ని గుర్తించి, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటిపారుదల మరియు హెచ్‌ఆర్‌డి వంటి అన్ని ముఖ్యమైన రంగాలను కవర్ చేస్తూ ప్రత్యేక, సంపూర్ణ ప్యాకేజీ అందించడం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు చాలా గర్వకారణం.’ అంటూ లోకేశ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు
Admin
Studio18 News