Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ విడిచి వెళ్లాలనడం భావ్యం కాదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను క్యాబ్ డ్రైవర్లు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు రెండూ ఒక్కటేనన్న భావన అందరిలో ఉండాలని చెప్పారు. ఇరు రాష్ట్రాల ప్రజల సఖ్యతే మనల్ని ప్రగతిలో ముందుకు నడిపిస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలు మెరుగైతే ఆంధ్ర నుంచి తెలంగాణకు వలసలు ఆగుతాయని చెప్పారు. ఫలితంగా తెలంగాణ ప్రజలకు వివిధ రకాల రంగాల్లో ఉపాధి మెరుగవుతుందని తెలిపారు. అక్కడి ప్రాంతం, ప్రజలు అభివృద్ధి బాటలో నడుస్తారని చెప్పారు. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్లను అడ్డుకోవడం వల్ల 2 వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనే సమస్య తన దృష్టికి వచ్చిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులు త్వరలోనే మొదలవుతాయి. మళ్లీ కార్యకలాపాలు మొదలు కానున్నాయని, ఇక్కడ కూడా తగిన అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఉమ్మడి రాజధాని గడవుకాలం అయిపోగానే ఆంధ్రప్రదేశ్ క్యాబ్ లు హైదరాబాద్ లో ఉండకూడదని అడ్డుకోవడం సబబు కాదని తెలిపారు.
Admin
Studio18 News